యాతాలకుంట టన్నెల్ పనుల పర్యవేక్షణ.. చాపరాలపల్లి వద్ద హై లెవెల్ బ్రిడ్జికి శంకుస్థాపన.
అశ్వారావుపేట, సెప్టెంబర్ 21: సీతారామ ప్రాజెక్టు నిర్మాణ పనుల్లో భాగంగా రాష్ట్ర వ్యవసాయ, చేనేత, మార్కెటింగ్, హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్స్ శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, అశ్వారావుపేట ఎమ్మెల్యే జారె ఆదినారాయణ, జిల్లా కలెక్టర్ అంకిత్ సోమవారం అశ్వరావుపేట నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులను పరిశీలించారు.
ముందుగా యాతాలకుంట వద్ద కొనసాగుతున్న సీతారామ ప్రాజెక్టు టన్నెల్ నిర్మాణ పనులను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఎమ్మెల్యే జారె ఆదినారాయణ, జిల్లా కలెక్టర్ అంకిత్ పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రాజెక్టు పనుల పురోగతిపై వివరాలు అధికారులను అడిగి తెలుసుకున్నారు. టన్నెల్ నిర్మాణ పనుల ప్రస్తుత పరిస్థితి, ఇప్పటివరకు పూర్తయిన పనులు, తదుపరి చేపట్టాల్సిన పనుల వివరాలను అధికారులు వారికి వివరించారు.
అనంతరం ములకలపల్లి మండలం చాపరాలపల్లి వద్ద నిర్మించనున్న హై లెవెల్ బ్రిడ్జి నిర్మాణ పనులకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఎమ్మెల్యే జారె ఆదినారాయణ, జిల్లా కలెక్టర్ అంకిత్ శంకుస్థాపన చేశారు. ఈ వంతెన నిర్మాణం పూర్తయితే ఆయా ప్రాంతాల ప్రజలకు రాకపోకలు మరింత సులభతరం కానున్నాయని అధికారులు తెలిపారు.
తదుపరి కమలాపురం వద్ద నిర్మించిన సీతారామ ప్రాజెక్టు పంప్హౌస్ను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఎమ్మెల్యే జారె ఆదినారాయణ, జిల్లా కలెక్టర్ అంకిత్ ప్రారంభించారు. సీతారామ ప్రాజెక్టు ద్వారా సాగునీటి సౌకర్యాలను మరింత మెరుగుపరిచి రైతులకు ప్రయోజనం చేకూర్చేలా చర్యలు కొనసాగుతున్నాయని అధికారులు వివరించారు.
సీతారామ ప్రాజెక్టు పనులు పూర్తయితే ఈ ప్రాంతంలోని వ్యవసాయానికి మరింత ఊతం లభించడంతో పాటు రైతులకు సాగునీటి సౌకర్యాలు మెరుగుపడే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో సంబంధిత శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, నాయకులు, స్థానికులు తదితరులు పాల్గొన్నారు.