TV6 24/7 NEWS – డిజిటల్ మీడియా నెట్వర్క్, కామేపల్లి మండలం, జులై 19. ఖమ్మం జిల్లా సింగరేణి సర్కిల్ పరిధిలోని కామేపల్లి మండలంలో తక్కువ ధరకు బంగారం ఇప్పిస్తామని నమ్మబలికి రూ.85.70 లక్షలు మోసం చేసిన ఇద్దరు అంతర్రాష్ట్ర నేరగాళ్లను కామేపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. సింగరేణి సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎన్. సాగర్ ఆధ్వర్యంలో నిర్వహించిన దర్యాప్తులో నిందితులను అదుపులోకి తీసుకుని, కేసుకు సంబంధించిన కీలక ఆధారాలను స్వాధీనం చేసుకున్నారు.
విచారణలో ప్రధాన నిందితుడు గురప్ప కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో వివిధ పేర్లతో సంచరిస్తూ ప్రభుత్వ ఉద్యోగాలు, తక్కువ ధరలో భూములు, బంగారం ఇప్పిస్తానని చెప్పి కోట్ల రూపాయల మేర ప్రజలను మోసం చేసినట్లు వెల్లడైంది. గతంలో జైలు శిక్ష కూడా అనుభవించినట్లు పోలీసులు తెలిపారు. తక్కువ ధరల ఆఫర్ల పేరుతో డబ్బులు అడిగే వ్యక్తులను నమ్మవద్దని, అనుమానాస్పద వ్యక్తులు లేదా మోసపూరిత ఆఫర్లపై వెంటనే సమీప పోలీస్ స్టేషన్కు సమాచారం అందించాలని పోలీసులు ప్రజలకు సూచించారు.