TV6 24/7 NEWS – డిజిటల్ మీడియా నెట్‌వర్క్. హైదరాబాద్, జూలై 29: హైదరాబాద్‌ కాచిగూడలోని అభిందన్ గ్రాండ్ హోటల్‌లో నిర్వహించిన ఓబిసి పోస్టర్ ఆవిష్కరణ సమావేశంలో మాజీ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా బెంగళూరులో ఆగస్టు 7న జరగనున్న అఖిల భారత జాతీయ ఓబీసీ 11వ మహాసభ పోస్టర్‌ను మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్, మాజీ ఎమ్మెల్యే వీరవల్లి అనిల్ కుమార్, చిన్న శ్రీశైలం యాదవ్‌తో కలిసి ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా వి. శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ… బీసీలకు జనాభా ప్రాతిపదికన విద్య, ఉద్యోగాలు, చట్టసభలు, కాంట్రాక్టుల్లో చట్టబద్ధమైన రిజర్వేషన్లు కల్పించాలని, జనగణనతో పాటు కులగణన కూడా నిర్వహించాలని డిమాండ్ చేశారు.

సర్పంచ్ ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రస్తుతం ఉన్న రిజర్వేషన్లను 17 శాతానికి తగ్గించిందని ఆయన ఆరోపించారు. కేంద్రంలో ఓబీసీల కోసం ప్రత్యేక బీసీ మంత్రిత్వ శాఖతో పాటు ప్రత్యేక బడ్జెట్ ఏర్పాటు చేయాలని, క్రిమిలేయర్‌ను రద్దు చేయాలని కోరారు.

రాష్ట్రంలో విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే చెల్లించి, కొత్త విద్యార్థులకు పాత విధానంలోనే ఫీజు రీయింబర్స్‌మెంట్ అమలు చేయాలని, కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో కులవృత్తుల అభివృద్ధికి ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీసీ సంఘం నాయకులు గుజ్జ కృష్ణ, గణేష్ చారి, శేఖర్ సాగర్, విక్రమ్ గౌడ్, శ్యామ్ కురుమ తదితరులు పాల్గొన్నారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *