TV6 24/7 NEWS – డిజిటల్ మీడియా నెట్‌వర్క్. ఖమ్మం తిరుమలాయపాలెం మండలం ఆగస్టు 09 : మండల పరిధిలోని పిండిప్రోలు గ్రామంలో జూలై 17 అర్ధరాత్రి వృద్ధురాలిని హత్య చేసి బంగారు ఆభరణాలు దోచుకెళ్లిన కేసును కూసుమంచి సర్కిల్ పోలీసులు ఛేదించారు. కేసులో ప్రధాన నిందితుడు పిండిప్రోలు గ్రామానికి చెందిన ఐతనబోయిన ప్రశాంత్ (26), అతనికి సహకరించిన మహబూబాబాద్ జిల్లా మర్రిపెడ మండలం బాలినిధర్మారానికి చెందిన సరగండ్ల మహేష్ (20)ను ఆదివారం ఉదయం తిరుమలాయపాలెం రోడ్డులో అరెస్ట్ చేసినట్లు ఖమ్మం రూరల్ ఏసీపీ తిరుపతి రెడ్డి మీడియా సమావేశంలో తెలిపారు.

పోలీసుల వివరాల ప్రకారం చికెన్ షాప్ నిర్వహించే ప్రశాంత్‌కు మద్యం సేవించడం, ఆన్‌లైన్ బెట్టింగ్ కారణంగా ఆర్థిక ఇబ్బందులు ఏర్పడటంతో, తన షాప్ సమీపంలో నివసించే వృద్ధ దంపతులను గమనించి వృద్ధురాలు సుగుణ మెడలో ఉన్న బంగారు ఆభరణాలను దోచుకోవాలని పథకం వేశాడు. జూలై 17 అర్ధరాత్రి ఇంట్లోకి వెళ్లి ఆభరణాలు దోచుకునే ప్రయత్నం చేయగా సుగుణ ప్రతిఘటించడంతో వెంట తెచ్చుకున్న ఇనుప రాడ్డుతో దాడి చేసి హత్య చేసిన అనంతరం బంగారు చైన్, నల్లపూసల చైన్‌కు సంబంధించిన బంగారు బిళ్లలను తీసుకుని పరారైనట్లు తెలిపారు.

హత్య అనంతరం దొంగిలించిన బంగారు చైన్‌ను తన వరుసకు బామ్మర్ది అయిన సరగండ్ల మహేష్‌కు ఇచ్చి బ్యాంకులో తనఖా పెట్టి డబ్బులు తీసుకురావాలని ప్రశాంత్ చెప్పినట్లు పోలీసులు తెలిపారు. మహేష్ ఆ బంగారు చైన్‌ను ఖమ్మంలోని ఓ బ్యాంకులో తన పేరుతో తనఖా పెట్టి రూ.1.50 లక్షల రుణం పొందినట్లు దర్యాప్తులో వెల్లడైందన్నారు. కేసు దర్యాప్తు అధికారిగా కూసుమంచి సర్కిల్ ఇన్‌స్పెక్టర్ సంజీవ్ ఆధ్వర్యంలో జగదీష్, సంతోష్, నాగరాజు, హరికృష్ణ, పీఎస్‌ఐ దివ్యతో నాలుగు బృందాలను ఏర్పాటు చేసి సమన్వయంతో దర్యాప్తు చేపట్టి నిందితులను త్వరితగతిన అరెస్ట్ చేసినట్లు ఏసీపీ తెలిపారు.

ఈ కేసులో సహకరించిన పూర్ణచందర్ రావు, శ్రీలత, కిషన్, రాంబాబు, తొంట శ్రీనులను పోలీసు ఉన్నతాధికారులు ప్రత్యేకంగా అభినందించారు. కేసుకు సంబంధించిన ఇతర అంశాలపై దర్యాప్తు కొనసాగుతోందని ఏసీపీ తిరుపతి రెడ్డి తెలిపారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *