TV6 24/7 NEWS – డిజిటల్ మీడియా నెట్వర్క్, పెనుబల్లి మండలం, సెప్టెంబర్ 16. ఉప్పలచిలక: తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వార్షికోత్సవాల సందర్భంగా ఉప్పలచిలక గ్రామంలో సభ నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కమిటీ సభ్యులు గాయం తిరుపతిరావు మాట్లాడుతూ.. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం భూస్వామ్య దోపిడీ, వెట్టిచాకిరి, నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా సాగిన చారిత్రాత్మక పోరాటమని అన్నారు.
రైతులు, వ్యవసాయ కూలీలు, పేద ప్రజలు భూమి, భుక్తి, విముక్తి కోసం ఐక్యంగా పోరాడారని, ఆ పోరాటంలో అనేక మంది రైతులు, కూలీలు, మహిళలు త్యాగాలు చేశారని పేర్కొన్నారు. వారి పోరాట స్ఫూర్తిని నేటి తరాలు కొనసాగించాలని పిలుపునిచ్చారు.
అడవులు, పోడు భూములపై ఆధారపడి జీవిస్తున్న పేద గిరిజనులు, దళితులు, బీసీలకు భూమిపై హక్కులు కల్పించాలని తిరుపతిరావు కోరారు. ఎన్నో ఏళ్లుగా పోడు భూములను సాగు చేసుకుంటున్న అర్హులైన వారికి ఎలాంటి వివక్ష లేకుండా పట్టాలు మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
భూమిలేని వ్యవసాయ కూలీలు, పేద రైతులకు సాగుభూమి కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట అమరుల ఆశయాలను ముందుకు తీసుకెళ్లేందుకు రైతులు, వ్యవసాయ కూలీలు, పేద ప్రజలు ఐక్యంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో తెలంగాణ కార్మిక సంఘం మండల కార్యదర్శి చెమట విశ్వనాథ, జొన్నలగడ్డ రవి తదితరులు పాల్గొన్నారు.