TV6 24/7 NEWS – డిజిటల్ మీడియా నెట్వర్క్, సత్తుపల్లి టౌన్, జులై 03. సత్తుపల్లి పట్టణంలో ఆశా స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో రాష్ట్రంలోనే తొలిసారిగా సుమారు 15 వేల మందితో భారీ వనమహోత్సవ ర్యాలీ ఘనంగా నిర్వహించారు.
జేవీఆర్ కాలేజ్ గ్రౌండ్లో ప్రారంభమైన ఈ కార్యక్రమానికి ఖమ్మం జిల్లా కలెక్టర్ దివాకర్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. సత్తుపల్లి ఎమ్మెల్యే మట్టా రాగమయి దయానంద్, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్తో పాటు ప్రజాప్రతినిధులు, అధికారులు, విద్యార్థులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం జేవీఆర్ కాలేజ్ నుంచి పాత సెంటర్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు.
ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలల విద్యార్థులు వేల సంఖ్యలో పాల్గొని పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించారు. ర్యాలీలో జానపద కళాకారుల ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ సందర్భంగా కలెక్టర్ దివాకర్ కార్యక్రమాన్ని అభినందించగా, ఎమ్మెల్యే మట్టా రాగమయి దయానంద్ మొక్కలు నాటడంతో పాటు వాటిని సంరక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ ఈ భారీ వనమహోత్సవం రాష్ట్ర చరిత్రలో ప్రత్యేక గుర్తింపు పొందుతుందని తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా డిసిసి అధ్యక్షులు నూతి సత్యనారాయణ గౌడ్ మాట్లాడుతూ చరిత్రలో కనివిని ఎరుగని విధంగా వన మహోత్సవ ర్యాలీ నిర్వహించటం చాలా సంతోషంగా ఉందని అన్నారు.