ఖమ్మం: ఒంటరిగా వెళ్తున్న మహిళలను లక్ష్యంగా చేసుకుని బంగారు ఆభరణాలను బలవంతంగా లాక్కొని పరారైన కేసులో నిందితుడికి మూడేళ్ల ఆరు నెలల సాధారణ జైలు శిక్షతో పాటు రూ.30 వేల జరిమానా విధించినట్లు ఖమ్మం త్రీ టౌన్ ఇన్స్పెక్టర్ మోహన్ బాబు తెలిపారు.
ఖానాపురం ప్రాంతానికి చెందిన 58 ఏళ్ల వల్లభి లలిత ఈ ఏడాది జనవరి 8న రాత్రి ఖమ్మం రైల్వే ఓవర్ బ్రిడ్జి ట్రంక్ రోడ్ సమీపంలో మెట్లు ఎక్కుతుండగా, గుర్తుతెలియని వ్యక్తి ఆమె మెడలోని సుమారు 20 గ్రాముల బంగారు పుస్తెలతాడును బలవంతంగా లాక్కొని పరారయ్యాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు త్రీ టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టగా, నిందితుడిని ఈదరబోయిన సుమన్గా గుర్తించి అరెస్ట్ చేశారు. అనంతరం న్యాయస్థానంలో చార్జ్షీట్ దాఖలు చేశారు.
ఖమ్మంలోని III అదనపు జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ అర్వ ప్రవీణ్ సాక్షుల, పంచుల వాంగ్మూలాలను పరిశీలించి నిందితుడిపై నేరం రుజువైనట్లు నిర్ధారించారు. దీంతో సుమన్కు మూడేళ్ల ఆరు నెలల సాధారణ జైలు శిక్షతో పాటు రూ.30 వేల జరిమానా విధించారు.
జరిమానా చెల్లించని పక్షంలో అదనంగా ఆరు నెలల సాధారణ జైలు శిక్ష అనుభవించాలని తీర్పు వెల్లడించారు. ఈ కేసులో సమర్థవంతంగా దర్యాప్తు నిర్వహించి, సాక్ష్యాధారాలను న్యాయస్థానంలో ప్రవేశపెట్టిన ఎస్ఐ కె. సురేష్తో పాటు ప్రభుత్వ న్యాయవాది ఎస్. గాయత్రి, సీడీఓ వి. రామకృష్ణ, కోర్టు లైజన్ అధికారులు కె. శ్రీకాంత్, డి. నాగేశ్వరరావు తదితరులను ఖమ్మం పోలీస్ కమిషనర్ అభినందించారు.